తెలంగాణలో ఎల్ నినో పై సీఎస్ కీలక సమీక్ష.. నెలాఖరులోపు కరవు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశం
ప్రస్తుతం తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు తాండవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అక్టోబర్ నెలాఖరు నాటికి సమగ్ర కరవు అంచనా నివేదికను సిద్ధం చేయాలని అన్ని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నెలకొన్న పరిస్థితులపై అధికారులతో చర్చలు జరిపారు.
ఇక వ్యవసాయం, విద్యుత్తు రంగాలపై ప్రధానంగా ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు కరవు మండలాలపై కూడా చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు చర్చించారు. ఈ క్రమంలోనే ఈ నెలాఖరులోపు కరవు పరిస్థితిపై నివేదిక సిద్ధంచేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా కరవు మండలాల గుర్తించాలని, వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాల్సి ఉంటుందని తెలిపారు.

అలాగే నివేదిక తయారీలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన నైరుతి రుతుపవనాల వర్షపాతంతో పాటు మరో 12 కీలక అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని కీలక విభాగాలైన వ్యవసాయం, ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భ జలాలు, పంచాయతీ రాజ్ తో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా తదితర ముఖ్యమైన శాఖల నుంచి వివరాలను సేకరించి సంయుక్తంగా ఈ రిపోర్టును రూపొందించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకున్న తాగునీటి ఎద్దడితోపాటు భూగర్భ జలాల్లో తగ్గుదల, సాగు విస్తీర్ణం పడిపోవడం వంటి సమస్యలపై అఖిలపక్షంతో చర్చలు జరిపి కేంద్రం నుంచి సాయం కోరేందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించనున్నారు.












Click it and Unblock the Notifications
