డెస్టినేషన్ వెడ్డింగ్ కు అడ్డాగా తెలంగాణ.. ఈ అడవుల్లో వెడ్డింగ్ కేంద్రాలు..
మారుతున్న కాలం ప్రకారం పెళ్లిళ్ల తీరు కూడా మారుతోంది. సాధారణంగా అనేక మంది వివాహాన్ని తమ ఇంటి వద్ద లేదా ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తుంటారు. మరికొందరు గుళ్లో పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ కు భారీగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ విధానం ట్రెండింగ్ లో ఉంది. పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. కాబట్టి ఆ మధుర క్షణాలను తనివితీరా ఆస్వాదించాలని ఇప్పుడు యువత డెస్టినేషన్ వెడ్డింగ్ కు మారుతోంది. అయితే ఇటీవలి కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అడ్డాగా తెలంగాణ ఉంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సాధారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే బయటి దేశాలకు వెళ్తుంటారు. డెస్టినేషన్ వివాహానికి అందమైన కొండ ప్రాంతాలను ఎంచుకుంటారు. మరికొంతమంది దేశంలోని హిల్ స్టేషన్స్ కు వెళ్తుంటారు. ఇక్కడి వాతావరణం ఇతర ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది.. అలాగే ఇక్కడ అందమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చని ప్రేమికులు అభిప్రాయపడుతుంటారు. అయితే తెలంగాణలోనే ఇలాంటి ఫీల్ ను ఇచ్చే డెస్టినేషన్ కేంద్రాల గురించి మీకు తెలుసా..? రాష్ట్రంలోని అనంతగిరి అడవుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ.. పలు ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ మేరకు అడుగులు వేస్తోంది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం 30 ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేసుకుంది. ఈ ఒప్పందాల ప్రకారం.. వికారాబాద్ అనంతగిరి అడవుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్స్ కేంద్రాలు రానున్నాయి. అలాగే హైదరాబాద్ లోని గోల్కొండ ప్రాతంలో తారామతి బారాదరిలో ఫైవ్ స్టార్ హోటల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో లగ్జరీ రిసార్ట్, నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో ధ్యాన కేంద్రాలు, ఎకో రిసార్టులు త్వరలో ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టులు 30 వేల మందికిపైగా ఉపాధి కల్పించనున్నాయి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలు ఏర్పడితే రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications