ఇది బెంగాల్ కాదు కేసీఆర్! ఈటల రాజేందర్ హెచ్చరిక, ‘కోతి చేష్టల రావు’ అంటూ విజయశాంతి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన సీఎం కేసీఆర్.. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయాలనడం దారుణమని అన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరూ కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్లు చేయరన్నారు.

ఇది బెంగాల్ కాదు కేసీఆర్..: ఈటల రాజేందర్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీజేపీని అణిచివేసేందుకు మమతా బెనర్జీ అమలు చేసిన ఫార్ములా ఇక్కడ అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని.. కానీ, ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని గుర్తు పెట్టుకోవాలని ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. 40 ఏళ్ల నుంచి బీజేపీ ఒక కమిట్మెంట్‌తో పనిచేస్తున్న పార్టీ అని.. పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూసి.. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిదులు, లీడర్లు అసహ్యించుకుంటున్నారని చురకలంటించారు ఈటల రాజేందర్.

కేసీఆర్‌ను చీదరించుకుంటున్నారు: ఈటల
ధాన్యం కొనుగోలు, బాయిల్ రైస్ విషయంలో కేంద్రం మీద సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే దిగిపోవాలని హితవు పలికారు. పూటకో మాట మాట్లాడే కేసీఆర్‌ను చూసి..ప్రతి ఒక్కరు చీదరించుకుంటున్నారని విమర్శించారు ఈటల రాజేందర్. బీజేపీపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. రైతు బంధుకు రూ.1500 కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి.. ఉప్పుడు బియ్యం విషయంలో రైస్ మిల్లులకు కలిగే నష్టాన్ని ఇస్తే సమస్యనే ఉండదన్నారు. ఇంత పంట వస్తున్నప్పుడు.. రైస్ మిల్లుల సంఖ్య ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. రైస్ మిల్లుల్లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టాలని సూచించారు.

కోతి చేష్టల రావంటూ విజయశాంతి సెటైర్లు
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని విజయశాంతి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను తిరగనీయకుండ్రంటూ తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంతోనే కుంటిసాకులు చూపి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు. హుజూరాబాద్ తరహాలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని విజయశాంతి హెచ్చరించారు.












Click it and Unblock the Notifications