ఇదో నయా దందా : ఈ చాక్లెట్లు తింటే లిక్కర్ తాగినంత కిక్కు
హైదరాబాద్ : అడ్డంగా ఆలోచించేవాడే అక్రమ దందాలకు స్కెచ్ గీస్తాడు. ఇలాగే ఓ అక్రమ దందాకు చాక్లెట్ కోటింగ్ ఇచ్చి మార్కెట్ లోకి వదులుదామని ప్రయత్నించారు కొంతమంది కేటుగాళ్లు. పైకి కేవలం చాక్లెట్ లాగే కనిపిస్తుంది.. కానీ దాన్ని కొరికితే తెలుస్తుంది అసలు విషయం. పైకి మాత్రం ఓ గట్టి పొరతో కోటింగ్ ఇచ్చి.. చాక్లెట్ లోపల మద్యం నింపి.. ఈ లిక్కర్ చాక్లెట్ల దందాకు స్కెచ్ వేసిందో ముఠా.

మల్లేపల్లిలోని ఒక చాక్లెట్ హబ్‌లో ఈ బాగోతం వెలుగు చూసింది. లిక్కర్ చాక్లెట్లు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. తనిఖీల్లో భాగంగా.. 380 రకాల బ్రాండ్ల పేరుతో ఉన్న చాక్లెట్లు లభ్యమయ్యాయి. వాటిని పరిశీలించిన అధికారులు, సీజ్ చేసి పూర్తిస్థాయి నివేదిక కోసం నారాయణగూడలోని ల్యాబ్‌కు తరలించారు.

ల్యాబ్ నివేదికను బట్టి లిక్కర్ చాక్లెట్స్ తయారుచేస్తున్న వారిమీద చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ లిక్కర్ చాక్లెట్స్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయమేంటంటే.. సదరు తయారీదారులు వీటికి రమ్ చాక్లెట్స్, విస్కీ చాక్లెట్స్, స్కాచ్ చాక్లెట్స్ అని పేరు పెట్టారు. కాగా, వీటికి బాగా అలవాటు పడిన కొన్ని సంపన్నవర్గాలు ఆర్డర్ ఇచ్చి మరీ వీటిని తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది.

ఒక్కోటీ రూ.50 నుంచి రూ.100 ధర :
అచ్చు మద్యం బాటిల్ ను తలిపించేలా ఉండే ఈ లిక్కర్ చాక్లెట్స్ ఒక్కో దాని ధర రూ.50 నుంచి రూ.100 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నగరంలోని పలు మాల్స్ కు వీటిని తరలించినట్లుగా తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన ఏపీతో పాటు, తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉన్న మాల్స్ కు ఈ లిక్కర్ చాక్లెట్స్ సరఫరా అవుతున్నాయని తెలిసింది.












Click it and Unblock the Notifications