ఎన్‌హెచ్-167 విస్తరణతో పాలమూరులో పారిశ్రామిక విప్లవం.. కేంద్రం వరం!
తెలంగాణాపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తూ కీలక ప్రాజెక్ట్ లను అందిస్తుంది. తెలంగాణాలోని మహబూబ్‌నగర్ జిల్లా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఒక మైలురాయి అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు గుడెబల్లూర్ వరకు 80 కి.మీ. మేర NH-167 జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మే 10న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.
పీఎం గతిశక్తి పథకం కింద NH-167 జాతీయ రహదారి విస్తరణ
రూ.3,180 కోట్ల అంచనా వ్యయంతో పీఎం గతిశక్తి పథకం కింద చేపట్టబోయే ఈ ప్రాజెక్టు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు తెలంగాణ-కర్ణాటక మధ్య సమగ్ర అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా మార్చడం ద్వారా రవాణా సమస్యలు తీవ్రంగా తగ్గి, సరకు రవాణా, ప్రయాణికుల సౌకర్యం భారీగా మెరుగుపడనుంది.

ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణం చేసేవి ఇవే
ఈ ప్రాజెక్ట్ రూ.3,180 కోట్లు వ్యయంతో, 80 కి.మీ పొడవుతో మహబూబ్‌నగర్ నుంచి గుడెబల్లూర్ వరకు, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) మోడల్ లో, KNR కన్‌స్ట్రక్షన్స్ దీనిని నిర్మాణం చేస్తుంది. ఈ విస్తరణలో 5 పెద్ద వంతెనలు, 36 చిన్న వంతెనలు, 260 కల్వర్టులు, 11 హై-లెవల్ వెహికల్ అండర్‌పాస్‌లు, 22 లో-లెవల్ అండర్‌పాస్‌లు మరియు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు.
హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌తో మహబూబ్‌నగర్‌ను అనుసంధానం
రెండేళ్లలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌తో మహబూబ్‌నగర్‌ను అనుసంధానం చేస్తుంది. మూడు ఎకనమిక్ నోడ్స్, ఏడు లాజిస్టిక్స్ నోడ్స్ మరియు తొమ్మిది సామాజిక నోడ్స్‌లు ఏర్పాటు కానున్నాయి. దీంతో షాద్‌నగర్, కొత్తూరు, జడ్చర్ల వంటి పారిశ్రామిక ప్రాంతాలు మరింత ఊపందుకుంటాయి.
ఈ జాతీయ రహదారి విస్తరణ పారిశ్రామిక విప్లవానికి నాంది
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, వాణిజ్యం, పర్యాటకం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం అవుతుంది. పాలమూరు ప్రాంతం చాలాకాలంగా వెనుకబడిన నేపథ్యంలో ఈ రహదారి విస్తరణ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణ సమయం సుమారు ఒక గంట 30 నిమిషాలు తగ్గడంతో పాటు ఇంధన వినియోగం, వాహనాల నిర్వహణ ఖర్చు తగ్గి స్థానిక ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది.
అభివృద్ధిలో కొత్త అధ్యాయం
ఈ మహత్తర ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలు పెట్టనుంది. ప్రధాని మోదీ శంకుస్థాపనతో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు జిల్లా ప్రగతిపై ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పాలమూరు జిల్లాలో ప్రగతి పరుగులు పెట్టించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications