హైదరాబాద్‌లో రూ. 850 కోట్ల స్కాం, ఎలా చేశారంటే?
హైదరాబాద్‌లో మరో భారీ స్కాం వెలుగుచూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ (FID) పేరుతో వేలాది మంది ప్రజల నుంచి చిన్న మొత్తాలుగా పెద్ద ఎత్తున సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా రూ. 850 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ డైరెక్టర్ కావ్య నల్లూరితోపాటు సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును అరెస్ట్ చేశారు.
దేశ వ్యాప్తంగా 6979 మంది బాధితుల నుంచి 17 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్రిటానియా, గోద్రెజ్, అమెజాన్ వంటి సంస్థలో పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫాల్కన్ అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు.

కాగా, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ సంస్థకు చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు ఇప్పటికే దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది. ఎప్ఐడీ ఛైర్మన్ అమర్‌దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సందీప్ దుబాయ్‌కు పారిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రజలను మోసం చేసిన సంస్థకు చెందిన 20 మందిపై సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎఫ్ఐడీ డైరెక్టర్లు అమర్ దీప్ కుమార్, కావ్యలను పోలీసులు ఏ1, ఏ2గా కేసులో చేర్చారు. ఈ సంస్థకు చెందిన మరో ఆరుగురు కీలక ఉద్యోగులు దేశంలోనే ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు. ఎఫ్ఐడీ బిజినెస్ హెడ్ పవన్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.
ఇన్వెస్టర్ల నుంచి ఒక మొబైల్ యాప్ ద్వారా ఎఫ్ఐడీ సంస్థ డబ్బులను సేకరించింది. కనిష్టంగా 15 రోజులు.. గరిష్టంగా ఆరు నెలల కాలపరిమితి వరకు పెట్టుబడులు పెట్టవచ్చని చెప్పింది. కొన్ని నెలల వరకు ఇన్వెస్టర్లకు లాభాలను పంచిన ఎఫ్ఐడీ.. ఆ తర్వాత జనవరి 10 నుంచి ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభాలను అందించలేదు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications