మామునూరు ఎయిర్ పోర్ట్ భూములపై హై టెన్షన్.. కొండా సురేఖకు రైతుల అల్టిమేటం!
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మామునూరు ఎయిర్పోర్ట్ పైన రగడ కొనసాగుతుంది. ఇప్పటికే మామునూరు ఎయిర్ పోర్ట్ ను సాధించిన ఘనత తమదేనని కాంగ్రెస్, బిజెపి క్రెడిట్ వార్ కు దిగితే తాజాగా మామునూరు ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మళ్లీ ఆందోళన బాట పట్టారు.
ఎయిర్ పోర్ట్ భూముల రైతుల ఆందోళన
మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన పనులలో భాగంగా నిన్న రెవెన్యూ అధికారులు భూముల సర్వేకు వెళ్లగా వారిని అడ్డుకున్న రైతులు నిరసన చేపట్టారు. జై జవాన్ జై కిసాన్ అంటూ రోడ్డెక్కి నినాదాలు చేసిన రైతులు తమకు న్యాయం జరిగేదాకా భూముల సర్వేకు ముందుకు కదలనివ్వమని అడ్డుకున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

న్యాయం జరిగేదాకా భూములివ్వం అంటున్న రైతులు
ముఖ్యంగా నక్కలపల్లి, గుంటూరు పల్లి, గాడి పల్లి, నల్లకుంట గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు దీంతో పోలీసులు భారీగా మోహరించి రైతులు ధర్నాకు ఎటువంటి అనుమతి లేదని వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా సూచించారు. దాదాపు 200 మంది రైతులు తమకు న్యాయం జరిగే వరకు ఎయిర్పోర్టుకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
కొండా సురేఖ హామీని ప్రశ్నిస్తున్న రైతులు
ఇక ఎయిర్ పోర్ట్ భూసేకరణ పై గతంలో కొండా సురేఖ సమావేశాన్ని నిర్వహించి రైతులకు మార్కెట్ రేటు ప్రకారం చెల్లిస్తామని హామీ ఇచ్చారని, మామునూరు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఐదు కోట్లకు పైగా ధర పలుకుతుందని, దాని ప్రకారమే అన్నదాతలకు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం చెల్లించకపోతే అదే ధర ఉన్న వ్యవసాయ భూములు తమకు తిరిగి ఇవ్వాలని వారు కోరుతున్నారు.
కొండా సురేఖకు ఎయిర్ పోర్ట్ భూముల విషయంలో రైతుల అల్టిమేటం
ఇక హామీ ఇచ్చిన ప్రకారంగా కొండా సురేఖ ఎమ్మెల్యేలు మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని అల్టిమేటం జారీ చేశారు. ఇక విమానాశ్రయం పునరుద్ధరణలో భాగంగా నక్కలపల్లి రహదారిని క్లోజ్ చేస్తున్నారని తమకు ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications