పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.. భారీ ఆస్తి నష్టం!
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటైన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో.. ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రూప రసాయనిక్స్ ఫ్యాక్టరీలో రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతంలో . ఇక్కడ వందలాది రసాయన, ఫార్మా, మెకానికల్, ప్యాకేజింగ్ పరిశ్రమలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఈ ఫ్యాక్టరీ గత కొన్ని నెలలుగా మూసివేయడంతో ప్రమాదం సమయంలో ఎవ్వరూ అక్కడ లేరని తెలుస్తోంది. దీంతో ప్రాణ నష్టం జరగకపోవడం పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన రసాయన డ్రమ్ములు పేలిపోవడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ పేలుడు శబ్దం పటాన్‌చెరు, ఇస్నాపూర్, ముత్తంగి వరకు వినిపించి ప్రజలు బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే పటాన్‌చెరు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మొదట మూడు ఫైర్ ఇంజన్‌లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు ప్రారంభించగా, తరువాత మరో నాలుగు ఇంజన్‌లు చేరడంతో మొత్తం ఏడు ఫైర్ ఇంజన్‌లు రాత్రంతా పోరాటం చేశాయి. ఫైర్ సిబ్బంది పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేయగలిగారు.
ఇక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. మంటలు వ్యాపించకుండా 500 మీటర్ల పరిధిలో భద్రతా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యేలు, జిల్లా రెవెన్యూ అధికారులు కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, దాదాపు కోట్లు రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని యంత్రాలు, రసాయన డ్రములు, స్టోరేజ్ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న సితార్ ఫ్లోర్ మిల్కు మంటలు వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పింది.
మొత్తానికి సుమారు ఆరు గంటల పాటు జరిగిన యత్నాల తరువాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే, పొగ వల్ల గాలి నాణ్యత దెబ్బతిన్నదా? రసాయనాల ప్రభావం పరిసర ప్రాంతాలపై ఉందా? అనే అంశాలపై పర్యావరణ శాఖ బృందం పరిశీలన ప్రారంభించింది. ఈ తరహా వరుస ఘటనలతో ప్రభుత్వం పరిశ్రమలలో భద్రతా తనిఖీలు కఠినంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications