తెలంగాణను కప్పేయనున్న పొగమంచు!
తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవగా.. ఇక రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా చలి ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.
మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు అక్కడక్కడ చలి గాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని కింది స్థాయిగాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు, చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్యను చూస్తే చలి తీవ్రతకు అద్దం పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఉండటంతో ఉదయం 7 గంటలకు ముందు.. రాత్రి 9 గంటల తర్వాత బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యులు చలికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వివరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారిలో రక్తనాళాలు కుచించుకు పోవడంతో పాటు రక్తం గడ్డ కట్టే సమస్యలు ఈ కాలంలో అధికంగా ఉంటాయన్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా బాడీ చెకప్ చేసుకోవాలని తెలిపారు. చలి బారినపడకుండా ఉండేందుకు స్వేటర్లు, డార్క్ కలర్ దుస్తులు ధరించాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమయాల్లో బయట తిరగవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications