రైళ్లల్లో ఏటీఎం కేంద్రాలు, తొలిసారి - ఈ ట్రైన్స్ లో అందుబాటులో..!!
రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైళ్లల్లో సేవలను పెంచేలా కొత్త ప్రణా ళికలను అమలు చేస్తోంది. వేసవిలో రద్దీ ఉన్న ప్రాంతాల్లో అదనపు రైళ్లను ప్రకటించింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వందేభారత్ ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో రైల్వే శాఖ తీసుకువచ్చిన కొత్త విధానం ప్రయాణీకులకు వెసులుబాటు కల్పించనుంది. దశల వారీగా ఈ నిర్ణయం విస్తరించేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
రైల్వే శాఖ దేశంలోనే తొలి సారిగా ప్రయాణికుల కోసం ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వే మొదటిసారిగా ముంబయి-మన్నాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌తో ప్రయోగాత్మకంగా ఓ ఏటీఎంను ఏర్పాటు చేసింది. త్వరలోనే మిగతా రైళ్లలోనూ ఇలాంటి కదిలే ఏటీఎంలు ఏర్పాటుకు నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రైళ్లలో ఈ ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతానికి దీనిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలోనే పూర్తి స్థాయిలో ఈ ఏటీఎం సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ ఛైర్‌కార్‌లో గతంలో ప్యాంట్రీ ఉండేది. ఆ స్థలంలోనే ఈ కొత్త ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి ఓ షట్టర్ డోర్‌ను కూడా అమర్చారు. అలాగే కోచ్‌లో ఏటీఎం ఏర్పాటు కు అవసరమైన మార్పులను మన్మాడ్ వర్క్‌షాప్‌లో చేయించారు. పంచవటి ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్లి వస్తుంటుంది. సుమారు 4.30 గంటల్లోనే ఇది గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. మిగిలిన ప్రధాన రైళ్లల్లో అన్ని జోన్ల పరిధిలో ఈ తరహాలో ఏటీఎంలు అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రస్తుత ఏటీఎంల పైన ప్రయాణీకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొని అవసరమైన మార్పులతో దేశ వ్యాప్తంగా అమలుకు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications