ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు.. కీలక పరిణామాలు
నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్నిప్రమాదంపై అనుమానాలు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ బిల్డింగ్ మొదటి ఫ్లోర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో చాలా విలువైన హార్డ్ డిస్క్ లు, డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో కీలక కేసుల ఆధారాలు బుగ్గిపాలు
ఓటుకు నోటు కేసు వీడియో, ఆడియో ఫైల్స్ తో పాటు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, అలాగే సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించిన డేటా, హార్డ్ డిస్క్ లు ఇక్కడే ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కీలక కేసులలో ఆధారాలు బుగ్గిపాలయ్యాయి అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ, ఈ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్
ఈ ఘటనపైన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రాపర్టీ రూమ్ లో భారీగా నల్లపొగతో కూడిన మంటలు వచ్చాయన్నారు. ఆ తర్వాత మంటలు ఇతర గదులకు కూడా వ్యాపించాయన్నారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, సర్వర్ రూమ్, అనాలసిస్ ఛాంబర్, హెచ్ఆర్డి హాల్ తో పాటు ఫర్నిచర్, పరికరాలు అగ్నిప్రమాదంలో కాలిపోయాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వార్తలపై సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్
ప్రమాదం జరిగిన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు, తన ఫిర్యాదు ఆధారంగా పోలీసు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ తీవ్రంగా ఖండించారు.
ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్
కీలకమైన కేసుల ఆధారాలు కాలిపోయాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా 2015 నాటి ఏసీబీ కేసులో ఉన్న 16 వస్తువులను అప్పట్లోనే పరిశీలించి, 2021లో కోర్టుకు తిరిగి అప్పగించామని, ప్రస్తుతం ల్యాబ్‌లో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో అందిన 136వస్తువులలో మెజారిటీ వస్తువుల రిపోర్ట్స్ ఇప్పటికే పంపామని, మిగిలినవి సురక్షితంగా ఉన్నాయని తెలిపారు.
ఫైర్ ఆడిట్ నిర్వహించి విధులను పునరుద్ధరిస్తామన్న శిఖా గోయల్
ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. మధ్యాహ్నం 1:30 కల్లా మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. త్వరలోనే ఫైర్ ఆడిట్ నిర్వహించి విధులను పునరుద్ధరిస్తామని, నిరాధారమైన పుకార్లను ఎవరూ నమ్మవద్దని శిఖాగోయల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications