తెరాసకు భారీ షాక్: అసిఫాబాద్ జిల్లాలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సిర్పూర్ కాగజ్ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన రోజే కుమరంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో ఈ ఎదురుదెబ్బ తగిలింది.
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెరాసకు రాజీనామా చేస్తున్నట్లుగా గురువారం ప్రకటించారు. ఇటీవల కాలంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కాగజ్‌నగర్‌లో పర్యటించినప్పటికీ తనకు సమాచారం లేదని చెప్పారు. ఈ ఆవేదనతోనే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

కోనేరు కోనప్పని ఆంధ్రా అప్ప అని గతంలో కేసీఆర్ విమర్శించారని కావేటి సమ్మయ్య విమర్శించారు. తెలంగాణ ఉద్యమ జెండా మోసిన తనలాంటి వాళ్లను అవమానించారని ఆరోపించారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తానని చెప్పారు. ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications