హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్
హైదరాబాద్ లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న జయలలిత భవనానికి 2017 నుంచి ఆస్తిపన్ను చెల్లించలేదని అధికారులు సీజ్ చేశారు.యూసఫ్ గూడా జిహెచ్ఎంసి సర్కిల్ 38 పరిధిలో ఉన్న ఈ భవనానికి 2017 నుంచి ఆస్తి పన్ను బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
హైదరాబాద్ లో జయలలిత భవనాన్ని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ
ఈ కారణంగా బకాయిల వసూళ్లలో భాగంగా, బకాయిలు చెల్లించని వారి భవనాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపిన అధికారులు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన భవనాన్ని కూడా సీజ్ చేశారు. నేడు దీనికి సంబంధించిన సీజింగ్ ప్రక్రియ కొనసాగింది. జయలలిత పేరుతో రిజిస్టర్ అయిన ఈ జి ప్లస్ ఫోర్ భవనం ఇంటి నెంబర్ 8-3-1099/A( పి టి ఐ ఎన్ నెంబర్ 1100 833 474.

ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని నోటీసులు
ఈ ఆస్తికి సంబంధించి 2017 నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో వన్ టైం సెటిల్మెంట్ కింద రాయితీ ఇస్తామన్నారు. రాయితీ పోగా 82 లక్షల 9182 రూపాయల బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించాలని జిహెచ్ఎంసి అధికారులు సూచించారు. ఇప్పటివరకు పన్ను చెల్లించకపోవడంతో, నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో అధికారులు భవనాన్ని సీజ్ చేశారు.
బకాయిలు చెల్లించని జయలలిత బంధువులు
గతంలో వాణిజ్య భవనంగా పన్ను విధించిన ఈ ప్రాపర్టీని 2017 నుంచి నివాస అవసరాలకు వాడుకుంటున్నాం అని దీనిని రెసిడెన్షియల్ గా మార్చాలని జయలలిత మేనల్లుడు చెన్నైకి చెందిన దీపక్ జయ కుమార్ గతంలో జిహెచ్ఎంసి అధికారులను కోరారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో డిప్యూటీ కమిషనర్ బకాయిలు చెల్లించాలని నోటీస్ లు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటీఎస్ అమలు
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ అమలు చేస్తున్నారు. ఈ పథకానికి మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మళ్లీ నిబంధనలు మారుతాయి. అప్పటినుంచి ఆస్తి పన్ను కట్టని వారు ఆస్తి పన్ను పైన వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.
బకాయిలు చెల్లించని వారి ఆస్తులు సీజ్
ఈరోజే ఆస్తి పన్ను చెల్లింపు కి చివరి రోజు కావడంతో ఎవరైతే బకాయిలు చెల్లించలేదో వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ప్రజలు తమ ఆస్తి పన్నును జిహెచ్ఎంసి వెబ్సైట్, మై క్యూర్ యాప్, మీసేవ కేంద్రాలు లేదా జిహెచ్ఎంసి సిబ్బంది ద్వారా డిజిటల్ పద్ధతిలో చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications