హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన ఫార్చ్యూనర్ కారు.. పల్టీకొట్టిన ఐ10.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
హైదరాబాద్ నగరంలోని పీర్జాదిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ఫార్చ్యూనర్ కారు అదుపు తప్పి ముందున్న ఐ 10 వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దాంతో ఐ 10 వాహనం పల్టీలు కొట్టింది. అంతటితో ఆగకుండా ఫార్చ్యూనర్ కారు అదుపుతప్పి ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ వేగం ధాటికి విద్యుత్ స్తంభం విరిగి నేరుగా వాహనంపైనే పడటంతో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఐ 10 కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదీగూడ వరంగల్ హైవే పిల్లర్ నంబర్ 57 వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన సాయిశివ, మేఘన దంపతులు ఐ 10 కారులో ఎల్ బీ నగర్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు వెళ్తున్నారు. అయితే వీరి కారు పీర్జాదిగూడకు చేరుకోగానే వెనుకనుంచి వచ్చిన ఫార్చ్యూనర్ వారి కారును బలంగా ఢీకొట్టింది. దాంతో ఐ 10 కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనాస్థలిలోని స్థానికులు వారిని చైతన్యపురిలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇక పోలీసుల విచారణలో ఫార్చ్యూనర్ కారు నడిపిన యువకుడు నారపల్లికి చెందిన మంగీలాల్ కుమార్ అకున్ సబర్వాల్(19) గా గుర్తించారు. అలాగే అకున్ సబర్వాల్ వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తెలిపారు. అంతేకాక ప్రమాదానికి గురైన ఫార్చ్యూనర్ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ నకిలీదిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
