వేర్వేరు ప్రమాదాల్లో 7గురు మృతి, వరంగల్ జైలులో ఖైదీ మృతి
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తిప్పర్తి మండలం మాడుగుల పల్లి టోల్‌గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నాం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పిడుగుపాటుకు ముగ్గురు మహిళల మృతి
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని దూపల్లి శివారులో మంగళవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి చెందారు. గ్రామానికి చెందిన లక్ష్మి(45), వాణి(22), సంగీత(17) పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడింది.
దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ముగ్గురికి సమీపంలో ఉన్న ఉషం లక్ష్మి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తహసీల్దారు వెంకటయ్య, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వరంగల్ జైలులో ఖైదీ మృతి
వరంగల్ సెంట్రల్ జైలులో అనారోగ్యంతో ఓ జీవిత ఖైదీ మృతి చెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు ఓ హత్యకేసులో గత తొమ్మిది సంవత్సరాలుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు.
రాంబాబు గతంలో సీపీఎంలో కీలక పదవుల్లో పనిచేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాంబాబు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ మృతిచెందినట్లు జైలు అధికారులు ధ్రువీకరించారు.
వినాయక మంటపం నిర్మిస్తుండగా అపశృతి: ఇద్దరి మృతి
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. వినాయక మంటపం వద్ద విద్యుత్ షాక్ కొట్టడంతో నిమ్మల నరేష్, పరశురాములు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
గ్రామంలోని యువకులు ఈ మధ్యాహ్నం మంటపం ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిద్దరూ బావ, బావమరిది అని సమాచారం. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications