హైదరాబాద్‌లో ఫాక్స్‌కాన్ మెగా పెట్టుబడి, లక్ష ఉద్యోగాలు: కేసీఆర్ సమక్షంలో ఎంఓయూ
ప్రపంచ ప్రసిద్ధిచెందిన ‘హోన్ హై పాక్స్ కాన్’ సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.
హైదరాబాద్: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన 'హోన్ హై పాక్స్ కాన్' సంస్థ ఛైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది.

తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడి: లక్ష మందికి ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీని ద్వారా హోన్ హై ఫాక్స్ కాన్ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.

యంగ్ ల్యూ కు కేసీఆర్ పుట్టిన రోజు కానుక
ఎలక్ట్రానిక్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదే ముఖ్యమైందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒకే సంస్థ ద్వారా లక్ష మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని పేర్కొంది. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించిందని హర్షం వ్యక్తం చేసింది. యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా ఇదే రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా యంగ్ ల్యూకి అందజేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

యంగ్ ల్యూ బృందానికి విందుతో కేసీఆర్ ఆతిథ్యం
అంతేగాక, ప్రగతిభవన్‌లో యంగ్ ల్యూ ప్రతినిధి బృంధానికి మధ్యాహ్నం భోజనంతో కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, డీజీపీ అంజనీకుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫాక్స్ కాన్ పెట్టుబడులపై కేటీఆర్ హర్షం
ఈ ఒప్పందంపై కేటీఆర్ స్పందించారు. ఫాక్స్ కాన్ మెగా పెట్టుబడితో రాష్ట్రంలో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 3.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని అన్నారు. వివిధ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications