చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్
హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతో పాటుగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ మేరకు అవార్డు గ్రహీతలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 ను సీఎం రేవంత్ రెడ్డి ప్రదానం చేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. మార్చి 19 గురువారం నిర్వహించిన ప్రదానోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇక సినిమా అవార్డులు కొన్నాళ్లపాటు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు. సీఎంను ఎప్పుడు కలిసినా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించే మాట్లాడతారని గుర్తుచేశారు.
అయితే కళాకారులను ఉత్సాహపరచడంలో పక్క రాష్ట్రం కొంత వెనుకంజలో ఉందని.. సినిమాళ్లకు దగ్గరగా ఉండే చంద్రబాబు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటామని చిరంజీవి స్పష్టం చేశారు. ఇక ఉత్తమ నటుడిగా అక్కినేని నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా నేషనల్ క్రష్ రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్), ఉత్తమ దర్శకుడిగా సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి మూవీ) తదితరులకు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను అందజేశారు. అలాగే పైడి జయరాజ్ అవార్డును కమలహాసన్ అందుకున్నారు.

ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ ప్రముఖులతోపాటు బాలీవుడ్ నుంచి రితేశ్ దేశ్ ముఖ్- జెనీలియా దంపతులు, మాధురీ దీక్షిత్ తదితరులు పాల్గొని సందడి చేశారు. అంతకుముందు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications