కెసిఆర్! ఇలాంటి పనులొద్దు, కొడుకు, కూతురు మేనల్లుడి పేర్లేనా?: గాలి ఫైర్
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకుని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయం సరికాదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు. అంతకంటే మంచి ప్రదేశంలో, ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
కేసీఆర్‌కు రాజకీయంగా జన్మనిచ్చిన ఎన్టీఆర్ స్మారకాన్ని చెరిపేయడం ఎంతవరకు సబబు అని గాలి ప్రశ్నించారు. అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారని తెలిపారు.
ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి వివాదం లేదని, అయితే, ఈ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఎన్టీఆర్ గార్డెన్ డిస్ట్రబ్ చేయడం మంచిది పద్ధతి కాదని అన్నారు.

ఈ విగ్రహాన్ని పెట్టాలంటే నెక్లెస్ రోడ్‌లో కల్యాణ మండపాలు కానీ, హోటళ్లు కానీ, చాట్ హౌస్‌లు కానీ రద్దు చేసి ఆ స్థలాల్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. సంజీవయ్య పార్క్ పక్కన చాలా ఖాళీ స్థలం ఉందని అన్నారు.
కేసీఆర్ కొడుకు, కూతురు, మేనల్లుడి పేర్లు మాత్రమే ఉండాలా? ఇంకా ఎవరి పేర్లు ఉండకూడదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే నిజామే మేలని అన్నారు. 'కేసీఆర్ గారూ!, ఇది మంచి పద్ధతి కాదు.. ఇటువంటి పనులు చేయద్దండి. రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడిని మర్చిపోవద్దండి' అని గాలి ముద్దుకృష్ణమ నాయుడు హితవు పలికారు.












Click it and Unblock the Notifications