టాలీవుడ్‌తోనూ నయీం లింకులు : సినిమాకు ప్లాన్, రక్తచరిత్రనే స్ఫూర్తి
హైదరాబాద్ : హత్యలు.. దందాలు.. నేరాలే కాదు నయీం ఫోకస్ సినిమాలపై కూడా పడింది. తన నేరచరిత్రను దాచిపెట్టి.. జనాల్లో క్లీన్ ఇమేజ్ ను సంపాదించుకునేందుకు సినిమాను ఓ అస్త్రంగా మలుచుకోవాలనుకున్నాడు నయీం. తద్వారా తన రాజకీయ ఎంట్రీకి దారులు ఏర్పరుచుకోవాలన్నది అంతిమంగా నయీం టార్గెట్.
స్పూర్తినిచ్చింది వర్మ రక్త చరిత్రనే :
పోలీసులు స్వాధీనం చేసుకున్న నయీం డైరీల్లో వెలుగు చూసిన నిజమిది. ఇందుకు నయీంకు స్ఫూర్తినిచ్చింది రక్త చరిత్ర సినిమానే అన్నది కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్నఅంశం. తన స్వీయ చరిత్రను తెరకెక్కించుకోవడం ద్వారా జనాల్లో తానో ఉత్తముడినన్నఅభిప్రాయాన్ని ఏర్పరచాలని నయీం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యే అవడానికి నెగటివ్ ఇమేజ్ అడ్డు :
తను ఎమ్మెల్యే అవడానికి నయీంకు తన నెగటివ్ ఇమేజ్ అడ్డు వచ్చింది. దాన్ని తొలగించుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలో ఉన్న 30వార్డుల్లో 30 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఆ ప్రయత్నాలు ఎందుచేతనో సఫలం కాకపోవడంతో.. నయీం దృష్టి సినిమాల మీదకు మళ్లింది.
అందులోను సీమ ఫ్యాక్షనిజం ఉన్న సినిమాలపైనే నయీంకి గురి కుదిరినట్లుగా తెలిసింది. ఇదే క్రమంలో.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర నయీంను ఆకట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇదే తరహాలో తన స్వీయ చరిత్రను క్లీన్ ఇమేజ్ తో తెరకెక్కించేందుకు నయీం ప్రయత్నాలు కూడా చేశాడట.
పలువురు సినీ వ్యక్తులతోను సంప్రదింపులు :
సినిమా తీయాలని బలంగా విశ్వసించిన నయీం.. ఇందుకోసం కొంతమంది సినీ వ్యక్తులతోను సంప్రదింపులు జరిపాడట. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఉన్న క్లబ్ కు తరుచూ వెళ్లడం మొదలుపెట్టిన నయీం.. అక్కడ కొంతమంది సినీ వ్యక్తులతో మంతనాలు జరిపాడన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఎమ్మెల్యే అవడమే టార్గెట్ :
భువనగిరిలో తనకున్న నెగటివ్ ఇమేజ్ కు తన సినిమా ద్వారా చెక్ పెట్టాలనుకున్నాడు నయీం. ఇందుకోసం తన నేర చరిత్రను కాకుండా.. కేవలం మావోయిస్టుగా తాను చేసిన కొన్ని చేసిన ఆపరేషన్లను హైలైట్ చేస్తూ సినిమా తీయాలని అనుకున్నాడు. ఇందుకోసం తన డైరీలో రాసుకున్న కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ను సినిమా కోసం నయీం రిఫర్ చేశాడని తెలుస్తోంది.
2019 ఎన్నికల ద్వారా తన పొలిటికల్ ఎంట్రీని ప్లాన్ చేసుకున్న నయీం.. అంతకు ఏడాది ముందు 2018లో తన సినిమాను తీసుకురావాల్సిందిగా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే పలువురు ద్వితీయ శ్రేణి దర్శకులతోను నయీం సంప్రదింపులు జరిపాడట.
గోవా గెస్ట్ హౌజ్ అడ్డాగా సినిమా చర్చలు :
సినిమా చర్చల కోసం గోవాలో ఉన్న తన కోకానట్ గెస్ట్ హౌజ్ నే అడ్డాగా చేసుకున్నాడట నయీం. రోడ్డు మార్గం ద్వారా సదరు దర్శకులతో గోవా చేరుకున్న నయీం.. సదరు దర్శకుల సలహా మేరకే తనను పోలీసులు గుర్తు పట్టకుండా ఆహార్యాన్ని మార్చుకోవడం.. అందుకోసం మేకప్ కిట్స్ వినియోగించడం ప్రారంభించాడని సమాచారం.
ఇదే క్రమంలో ఓ మాజీ పోలీసు అధికారితోను నయీంకు పరిచయం ఏర్పడినట్టు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుం ఆ మాజీ పోలీస్ అధికారి ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు.












Click it and Unblock the Notifications