బీసీ కులాలకు రూ. లక్ష: ప్రాధాన్యత ఇలా ఉంటుందన్న మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్: బీసీ కులాలకు రూ. లక్ష ఆర్థిక సాయం పథకంపై కీలక విషయాలను వెల్లడించారు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. బీసీ వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం కోసం 5,28,862 దరఖాస్తులు వచ్చినట్లు గంగుల చెప్పారు. ఇందులో బీసీ-ఏ కేటగిరీ నుంచి 2,66,001, బీసీ-బీ నుంచి 1,85,136, బీసీ-డీ నుంచి 65,310 దరఖాస్తులతో పాటు ఎంబీసీలు 12,415 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
ఈ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైందని మంత్రి తెలిపారు. క్రమ సంఖ్య ప్రకారం ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి నెలా 5వ తేదీ వరకు పరిశీలన పూర్తయిన వారికి అదే నెల 15వ తేదీన స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థికసాయం అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

మార్గదర్శకాల విషయానికొస్తే.. రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు వరుస క్రమం(సీరియల్ నంబరు) ఆధారంగా సాయం పంపిణీ జరుగుతుందని స్పష్టం చేసింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదంతో అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రతి నెలా వరుస క్రమంలో ఎంపిక జాబితాలు సిద్ధంచేసి, ఆ వివరాలు వెబ్‌సైట్‌తోపాటు మండల స్థాయి కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
మండల స్థాయిలో దరఖాస్తుల పరిశీలన జూన్ 26 నాటికి పూర్తిచేసి అర్హుల జాబితాను సంబంధిత జిల్లా బీసీ సంక్షేమాధికారులకు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. అర్హులను ఎంపికచేసే సమయంలో అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీ)లకు మొదట ప్రాధాన్యమివ్వాలని సూచించింది.
లబ్దిపొందే కులాల విషయానికొస్తే... బీసీలకు లక్ష రూపాయలు పథకం కింద 1. నాయూ బ్రాహ్మణులు, 2. రజక, 3. సరగ లేదా ఉప్పర, 4. కుమ్మరి లేదా శాలివాహన, 5. గోల్డ్‌స్మిత్, 6. కంసాలి, 7. వడ్రంగి, శిల్పులు, 8. వడ్డెర, 9. కమ్మరి, 10. కంచరి, 11. మేదర, 12. కృష్ణ బలిజ పూసల, 13. మేర (టైలర్స్), 14. అరె కటిక, 15. ఎంబీసీ కులాలు ఉన్నాయి. 36 కులాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. వీరిలో దాసరి, దొమ్మర, జంగం, పాములు, పర్తి, పెద్దమ్మవండ్లు, వీరముష్టి, గుడల, కంజర, రెడ్డిక, మందుల, బుక్క అయ్యవారు, రాజన్న వంటి కులాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications