గ్రేటర్ ఎన్నిక: చంద్రబాబుకు కిషన్ రెడ్డి ఝలక్, ఇష్టం లేకపోయినప్పటికీ..!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందా అంటే అవుననే అంటున్నారట బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు కలిసి పోటీ చేస్తున్నాయి.
దీనిపై కిషన్ రెడ్డి సాక్షి ఛానల్లో మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే టిడిపితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని, బిజెపి జాతీయ పార్టీ కనుక ఢిల్లీ స్థాయిలో విశాల దృక్పథంతో నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. టిడిపితో కలిసి గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత 2019లో రాష్ట్రంలో బిజెపి అధఇకారంలోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో పర్యటించేందుకు ప్రధాని మోడీ ఆసక్తి చూపిస్తున్నారని, కానీ తెరాసకే ఇష్టం లేదని ఆయన చెప్పారు.

త్రిపురలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నా వాళ్లు ఆహ్వానిస్తే ప్రధాని వెళ్లారని ఆయన చెప్పారు. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఆహ్వానించడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుంచి ప్రతినిధి బృందం రావడానికి ఆసక్తి కనబర్చినా తెరాస నేతలే వద్దన్నారని చెప్పారు.
నిధుల మంజూరులో కేంద్రం వివక్ష చూపడం లేదన్నారు. కానీ దానిని ప్రచారం చేసుకోవడంలో బిజెపి విఫలమైందన్నారు. కాగా, తెలంగాణలో టిడిపితో కలిసి వెళ్లడం తెలంగాణ బిజెపి నేతలకు మొదటి నుంచి ఇష్టం లేదనే వాదన ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications