కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన బహుమతులు రోడ్డుపై విసిరేసి.. పోలీస్ కేస్ పెట్టిన ఓటర్లు.. ఎందుకంటే
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేక జిల్లాలలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలను పంచి తమకు ఓటేయాలని అభ్యర్థించారు. తీరా ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత తాము ఇచ్చిన బహుమతులు తిరిగి తమకు ఇచ్చేయాలని ఇంటింటికి తిరిగి మరీ వసూలు చేశారు. దీనికి సంబంధించి అనేక ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన బహుమతులపై రచ్చ
నిన్నటికి నిన్న ఓటు వేశానని దేవుడి మీద ఒట్టేసి చెప్పు లేదంటే డబ్బులు ఇచ్చేయ్ అంటూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ నుంచి పోటీ చేసిన బిజెపి అభ్యర్థి జాది తిరుపతి తాలూకా కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తే, తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఒకటవ వార్డు నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓటమిపాలైన అభ్యర్థి స్వరూపారాణి ఇచ్చిన బహుమతులపైన రచ్చ కొనసాగుతుంది.

అభ్యర్థి ఇచ్చిన బహుమతులు రోడ్డుపై పడేసిన ఓటర్లు
భువనగిరి ఒకటవ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరూపారాణి చీరలు, హాట్ బాక్సులు, కుక్కర్ లను స్థానిక ఓటర్లకు పంపిణీ చేసింది. ఇక వీటిని ఓటర్లు బహిరంగంగా రోడ్డుపై ఉంచి, గిఫ్టులు ఇచ్చి ఇప్పుడు గొడవ చేస్తున్నారంటూ రచ్చ చేశారు. ఓట్లు వేయలేదని దాడులు చేస్తారా? మీ గిఫ్టులు మాకు వద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు వాటిని రోడ్డుపై పడేశారు.
ఓటర్ల ఇళ్ళపై దాడులకు దిగిన ఓడిన అభ్యర్థి తరపు బంధువులు
స్వరూపరాణి తాలూకా బంధువులు, అనుచరులు ఆమె ఎన్నికలలో ఓడిపోయిందని తమ పైన దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వారంతా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.స్వరూపారాణి దగ్గర డబ్బులు, బహుమతులు తీసుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి వారు ఓటు వేశారని ఆమె అనుచరులు ఆరోపిస్తూ ఇళ్లపైన దాడులకు దిగారు.
ఇళ్ళపైకి గాజుసీసాలు విసిరి దాడులు.. పోలీసులకు ఫిర్యాదు
రాత్రి వేళల్లో వార్డులోని కొన్ని ఇళ్లపైకి గ్లాసు సీసాలు విసిరి నోటికొచ్చినట్టు దూషించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, తమకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. అయితే ఈ దాడులకు తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్న స్వరూపారాణి దాని ఓటర్లకు ఎటువంటి బహుమతులు పంపిణీ చేయలేదని వివరించారు. ఏది ఏమైనా ఈసారి ఓటర్లు బహుమతులు ఎవరు ఇచ్చినా, ఓటు తాము ఎవరికి వేయాలనుకుంటే వారికే వేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది.












Click it and Unblock the Notifications