కదులుతున్న బస్సులో యువతిపై రేప్: వీడియో చూపించి పలుమార్లు...
కదులుతున్న బస్సులో తనతో చనువుగా ఉన్న యువతిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకిరించి, బెదిరిస్తూ పలుమార్లు రేప్ చేశాడు.
హైదరాబాద్: కదులుతున్న బస్సులో ఘోరం జరిగింది. తనను నమ్మిన యువతిపై ఓ యువకుడు కదులుతున్న బస్సులో అత్యాచారం చేశాడు. తనతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కదులుతున్న బస్సులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ అఘాయిత్యాన్ని దుర్మార్గుడు సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే వీడియోను నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరించాడు. తర్వాత ఆ వీడియోను చూపించి బెదిరిస్తూ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అతని దుర్మార్గాన్ని భరించలేక ఆ యువతి చివరికి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి అరాచకాలు బయటపడ్డాయి.

ఆ ఘటనపై గొట్టిముక్కల కృష్ణ అనే వ్యక్తిపై హైదరాబాదులోని ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడి మరిన్ని దారుణాలు వెలుగు చూశాయి. అతను యువతులను ఇలాగే ప్రేమ, పెళ్లి పేరుతో వంచించినట్టు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు, నిందితుడు కృష్ణ స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న హాస్టల్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువతి ఉంటోంది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆమె ఐటీ ఉద్యోగం కోసం ఓ కంప్యూటర్ కోర్సులో శిక్షణ తీసుకుంటోంది.
కృష్ణ ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తండ్రికి ఆరోగ్యం బాగా లేదని ఫోన్ రావడంతో ఆ యువతి కంగారుపడింది. అయితే తనకు అక్కడి వైద్యులు తెలుసునంటూ ఆమెతో కలసి కృష్ణ నెల్లూరు జిల్లాకు వెళ్లాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరూ ఓ స్లీపర్ కోచ్ ప్రైవేటు బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు.
ఆ సమయంలో బస్సులోనే యువతిపై కృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కృష్ణ మరో యువతితో చనువుగా ఉండటాన్ని గమనించి ఆమె నిలదీసింది. పెళ్లిచేసుకోమని డిమాండ్ చేసింది. పెళ్లి పేరెత్తితే తన వద్దవున్న వీడియోలను ఆమె తండ్రికి పంపుతానని, నెట్‌లో పెడతానంటూ కృష్ణ బెదిరించాడు.
దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు కేసుకు భయపడిన అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చాడు. శుక్రవారం పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మని గదికి పిలిపించి ఆమెపై మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు.












Click it and Unblock the Notifications