దసరా పండుగకు అదిరిపోయే శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.25వేలు, రూ.12,500!
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలు చాలా ఘనంగా వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈ రెండు పండుగలకు తెలంగాణ ప్రజలు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ పండుగలకు ప్రజలకు సంతోషం కలిగేలా అనేక వరాలను ప్రకటిస్తూ ఉంటాయి .మరీ ముఖ్యంగా సింగరేణి అయితే తమ ఉద్యోగులకు దసరా పండుగకు శుభవార్త చెప్పి తీరుతుంది. ఈ ఏడాది దసరా పండుగకు కూడా సింగరేణి యాజమాన్యం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
సింగరేణి ఉద్యోగులకు శుభవార్త
సింగరేణి ఉద్యోగులు దసరా పండుగను ఘనంగా జరుపుకోవడానికి పండుగ అడ్వాన్స్ ముందే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు తాత్కాలిక ఉద్యోగులకు కూడా పండుగ అడ్వాన్స్ చెల్లించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించడంతో తాత్కాలిక ఉద్యోగులు సైతం అడ్వాన్సుగా డబ్బులు పొందనున్నారు.

రెగ్యులర్, తాత్కాలిక ఉద్యోగులకు అడ్వాన్స్
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అర్హులైన రెగ్యులర్ ఉద్యోగులకు 25వేల రూపాయలు చొప్పున దసరా అడ్వాన్స్ ను అందించనున్నారు. అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగులకు, కార్మికులకు 12,500 చొప్పున అడ్వాన్స్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ డబ్బులు వారికి ఈనెల 23వ తేదీన ఖాతాలలో జమ చేస్తామని యాజమాన్యం ప్రకటన చేసింది.
2024 25 ఆర్థిక సంవత్సరం సింగరేణి లాభాలు
ఇదిలా ఉంటే 2024 25 ఆర్థిక సంవత్సరం పూర్తి దాదాపు ఐదున్నర నెలలు కావస్తుంది. ఇంతవరకు సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించలేదు. సింగరేణి యాజమాన్యం లాభాలను వెల్లడించిన కొద్ది రోజుల వ్యవధిలో అందులోనుండి కార్మికులకు చెల్లించాల్సిన వాటాను సీఎం నిర్ణయించడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతో దీనిపై మాట్లాడారు.
సింగరేణి లాభాల వాటాపై సీఎం సానుకూల స్పందన
సింగరేణి సంస్థకు సంబంధించిన కీలక అంశాల పైన చర్చలు జరిపిన కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి గుర్తింపు సంఘం యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు సింగరేణి లాభాల వాటాను 35 శాతానికి పెంచాలని ఆయన ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు.












Click it and Unblock the Notifications