తెలంగాణలో వివాహితలకు తీపి కబురు.. 14 వేల అంగన్‌వాడీ పోస్టులకు ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ సర్కారు తెలంగాణలోని వివాహిత మహిళలకు తీపి కబురు ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్భంగా 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. ఆ రోజు లక్ష మందితో సభ నిర్వహిస్తామని సీతక్క తెలిపారు. ఇదే రోజు 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని ఆమె వెల్లడించారు.

అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్ పాసై ఉండాలన్న నిబంధన ఈసారి ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. మొత్తం పోస్టుల్లో అంగన్‌వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 ఉన్నాయి. అలాగే ఈ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు మాత్రమే అర్హులని వివరించారు. నోటిఫికేషన్ వచ్చాక ఆసక్తి కలిగిన వివాహిత మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం మంత్రి సీతక్క సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. మాట ఇస్తే చేసి తీరుతామని సీతక్క గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications