టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు,,4.9 శాతం డీఏ మంజూరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) యాజమాన్యం తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా మరో విడత కరవు భత్యం(డీఏ) ఇవ్వాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు.
జులై 2022లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 2011లో దాదాపు 29 రోజులపాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్‌లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిందని ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ ప్రకటించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏ త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్ వెల్లడించారు.
కాగా, తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 21 రోజుల పాటు సాగే ఈ దశాబ్ధ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ విభిన్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసింది. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక జిల్లాల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications