ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు NH 65 విస్తరణపై కేంద్రం శుభవార్త!
ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం మరో మారు శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులతో రెండు తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి పై ఫోకస్ చేసిన కేంద్రం జాతీయ రహదారి 65 విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నేషనల్ హైవే 65 నాలుగు లైన్లు ఉండగా నాలుగు లైన్ల నుండి ఆరు లైన్ల విస్తరణకు కేంద్రం అనుమతినిచ్చింది.
జాతీయ రహదారి 65 విస్తరణ
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు వరకు జాతీయ రహదారి 65 ను విస్తరించారు. దాదాపు 1800 కోట్ల రూపాయలతో జాతీయ రహదారిని నాలుగు లైన్లతో నిర్మించారు. అయితే ఈ సమయంలోనే ఆరు లైన్ల రహదారి కోసం భూసేకరణ కూడా నిర్వహించారు.

ఆరు లేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
అయితే ఈ నేషనల్ హైవే ఆరు లేన్ల విస్తరణ కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ తో సమావేశమై విజ్ఞప్తి చేశారు . దీంతో ఎట్టకేలకు ఆరు లైన్ల జాతీయ రహదారిగా దీనిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ జాతీయ రహదారి విస్తరణ జరిగితే రవాణా మరింత సునాయాసం అవుతుందని, ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
భారతదేశంలో ప్రధాన జాతీయ రహదారి 65
భారతదేశంలో ప్రధానమైన జాతీయ రహదారిగా ఉన్న 65 నెంబర్ జాతీయ రహదారి మహారాష్ట్రలోని పూనే పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పట్టణాన్ని కలుపుతూ సాగింది. గతంలో జాతీయ రహదారి 9 గా ఉన్న ఇది జాతీయ రహదారి 65 గా మార్చబడింది. మొత్తం మహారాష్ట్రలో 336 కిలోమీటర్లు, కర్ణాటకలో 75 కిలోమీటర్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 430 కిలోమీటర్ల తో కలిపి సుమారు 841 కిలోమీటర్ల పొడవుతో ఉంది.
ఏపీ, తెలంగాణా వాసులకు సంతోషం
ఈ జాతీయ రహదారిని విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఆరు లేన్ల జాతీయ రహదారిగా విస్తరించడానికి కేంద్ర అనుమతించడంతో ఇప్పటికే భూసేకరణ పనులు కూడా పూర్తి కావడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications