అదృష్టమో, దురదృష్టమో: విభజనపై గవర్నర్, అందరు కలిసినా: కవిత
హైదరాబాద్: అదృష్టమో, దురదృష్టమో రాష్ట్రం విడిపోయిందని గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలన్నారు.
అదృష్టమో, దురదృష్టమో విభజన జరిగిందని, ఇప్పుడు ఏపీ, తెలంగాణలు అభివృద్ధి చెందాలన్నారు. స్కౌట్‌లో ఇరు రాష్ట్రాలు కలిసి పని చేయాలని చెప్పారు. కనీసం నెలకు ఒక్కసారైనా స్వచ్చ భారత్‌లో పాల్గొనాలని ఆయన హితవు పలికారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: కవిత
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన ఓటర్లకు నిజామాబాద్ టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. 2019లో కూడా ఇదే విజయం పునరావృతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అచ్చంపేట నగర పంచాయతీలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడినా ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేకపోయాయన్నారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. టిడిపికి తెలంగాణలో స్థానం లేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో టిడిపికి షాక్
గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలే... టిడిపి కనుమరుగైందనేందుకు నిదర్శనం అని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు చోట్ల టిడిపి పోటీ చేసినప్పటికీ ఘోర పరాజయం పాలైంది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.
అచ్చంపేటలో 4 వార్డులలో, వరంగల్‌లో 51 డివిజన్లలో, ఖమ్మంలో 48 డివిజన్లలో పోటీ చేసిన టిడిపి ఏ ఒక్క స్థానంలోనూ గెలువలేదు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లు తెరాసలో చేరుతున్నారు. ఈ విజయంతో మరికొంత మంది టిడిపి తమ్ముళ్లు తెరాసలో చేరడం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications