వైభవంగా హైదరాబాద్ బోనాలు: ఇద్దరు గవర్నర్లు, మంత్రులు, బోనమెత్తిన విజయశాంతి, మిథాలీ
హైదరాబాద్: నగరంలో ఆదివారం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించారు. ఆషాఢమాసం చివరివారం నిర్వహించే బోనాలతో పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో నగరం పులకించిపోయింది. కాగా, ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతోపాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆలయాన్ని సందర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఐక్యతతో బోనాల ఉత్సవాలు చేసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర కొనసాగుతుందన్నారు.
ప్రశాంతంగా బోనాల జాతర జరుపుకోవాలన్నారు. ప్రముఖ ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి మంచి వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి చల్లని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు.
హర్యానా గవర్నర్ బండా దత్తారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని దత్తాత్రేయ సూచించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అన్నారు. భారత మాజీ క్రికెటర్ మిథాళీ రాజ్ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్ తన కుటుంబసభ్యులతో కలిసి కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
నేడు బోనాలు సందర్భంగా కవాడిగూడలోని లోవర్ ట్యాంక్ బండ్ లో ఉన్న కట్ట మైసమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాను.#Bonalu #Hyderabad pic.twitter.com/Jca7pGhUYB
— Dr K Laxman (@drlaxmanbjp) July 16, 2023
మరోవైపు, రాజ్‌భవన్‌లోనూ ఆదివారం బోనాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాజ్ భవన్ సిబ్బంది రాజ్‌భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అధికారికంగా బోనాల ఉత్సవాలకు తనను ఆహ్వానించలేదని గవర్నర్ తెలిపారు. అందుకే రాజ్‌భవన్‌లోనే వేడుకలు చేసుకున్నట్లు తెలిపారు.
రాజ్ భవన్ లో ఈరోజు తెలంగాణ బోనాల పండుగ సంప్రదాయ పద్ధతి లో ఘనంగా జరుపుకున్నాము.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 16, 2023
అమ్మ వారికి బోనం సమర్పించాను.
దేశానికి, తెలంగాణ కు అంతా మేలు చేకూరాలని వేడుకున్నాను.#Bonalu #bonalu2023#Hyderabad pic.twitter.com/iQElZ8sGUF
కాగా, హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు ప్రజలతోపాటు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా బోనాలు సమర్పించారు. బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదివారం బోనాల అనంతరం సోమవారం ఘటాలు, ఫలహారం, బండ్ల ఊరేగింపుతో పండగ ముగియనుంది.












Click it and Unblock the Notifications