రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్..!!
రుణమాఫీ అమలు కాని రైతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో విడత రుణమాఫీ అమలైన ఇంకా తమకు రుణమాఫీ కాలేదంటూ పలువురు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని అర్హతలున్నా తమకు మాఫీ ఎందుకు వర్తించలేదని బ్యాంకులు, సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. దీంతో, ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేకంగా యాప్ ద్వారా వారి వివరాలు సేకరిస్తోంది.
రుణమాఫీ అమలు
పులువరు రైతులకు సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ అమలు కాలేదు. ఆధార్ నంబర్ తప్పుగా ఉందని, పేర్లు సరిగా లేవని, రేషన్ కార్డు లేదనే సాకుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నా రికార్డులో నమోదు చేయకపోవడంతో మాఫీకి దూరమయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు. దీంతో, ప్రభుత్వం ఈ అంశం పైన ఫోకస్ చేసింది. ప్రత్యేక యాప్ ద్వారా రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి, వారికి న్యాయం చేస్తామని ప్రకటించింది.

యాప్ తో సర్వే
అర్హులై ఉండి కూడా రుణమాఫీ వర్తించని రైతుల వివరాలు నమోదు చేయడానికి రైతుభరోసా పంట రుణమాఫీ యాప్ ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. అధికారులు గ్రామాలకు వెళ్లి రుణమాఫీ కానివారి వద్ద వివరాలు సేకరించి ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతుల నుంచి సెల్ఫ్ సర్టిఫికెట్ తీసుకుని, స్థానిక పంచాయతీ కార్యదర్శి రిపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ సర్వే మొదలవుతుంది. గ్రామాల్లోకి వచ్చే సర్వే టీమ్ లకు తమ ఇబ్బందులు చెబితే వారు యాప్ లో వారి వివరాలు నమోదు చేసుకుంటారు.
ప్రభుత్వ నిర్ణయం
అధికారులు సేకరించిన సమాచారం పరిశీలించి ఉన్నతాధికారులు వారికి నిధులు విడుదల చేస్తారు. ఇప్పటి వరకు రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మూడు విడతల్లో మాఫీ జరిగింది, అది కూడా అరకొరగానే. ఇక రూ.2 లక్షల పైన రుణాలు తీసుకున్నవారికి మాఫీకోసం కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ముందు ప్రభుత్వం రూ.2 లక్షలు మాఫీ చేయాలని, ఆ తర్వాత మిగతా సొమ్ముని తాము ప్రభుత్వానికి చెల్లిస్తామని రైతులు అభ్యర్దిస్తున్నారు. దీని పైన ప్రబుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications