టెక్ గురు 'హఫీజ్': అతని వీడియోలకు జనం ఫిదా.. యూట్యూబ్‌తో లక్షల్లో సంపాదన
యూట్యూబ్ సంస్థ వారు హఫీజ్ కు రూ.1.50లక్షలను ప్రతీ నెల చెల్లిస్తున్నారు.
పెద్దపల్లి: పొద్దస్తమానం సోషల్ మీడియాలో మునిగితేలుతూ సమయాన్ని వృథా చేసుకునేవాళ్లు కొందరైతే.. ఆ సమయాన్ని సంపాదనకు అనువుగా మార్చుకునేవారు మరికొందరు. పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీకి చెందిన ఓ యువకుడు యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో సంపాదిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రామగుండం మండలం యైటింక్లైయిన్ కాలనీకి చెందిన హఫీజ్ యూట్యూబ్ ద్వారా టెక్ పాఠాలు బోధిస్తూ లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాడు. యూట్యూబ్‌లో హఫీజ్ నిర్వహిస్తున్న తెలుగు టెక్ ట్యూట్స్‌కు 4కోట్ల వ్యూస్.. 4.30లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

2006నుంచి:
యైటింక్లైయిన్ కాలనీలో హఫీజ్ ఒక కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2006లో తనకు తెలిసిన టెక్నాలజీ గురించి తొలిసారి యూట్యూబ్ లో ఓ ట్యుటోరియల్ అప్ లోడ్ చేశాడు. అప్పటినుంచి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి.. ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాలపై యూట్యూబ్ ట్యుటోరియల్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు.

10వేల నుంచి 4కోట్లకు:
తొలుత 10వేల వ్యూస్ తో ప్రారంభమైన 'తెలుగు టెక్ ట్యూబ్స్' ఇప్పుడు 4కోట్ల వ్యూస్ కు చేరుకోవడం విశేషం. తొలినాళ్లలో ఎంఎస్ ఆఫీస్, సీ లాంగ్వేజ్ ట్యుటోరియల్స్ ను హఫీజ్ అప్ లోడ్ చేశాడు. అయితే అప్పట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ వినియోగం ఇంతగా లేకపోవడంతో అంతగా ఆదరణ లభించలేదు. అయితే రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చి వీక్షకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

మొబైల్ సీక్రెట్స్‌కు మంచి స్పందన:
2014తర్వాత స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడం, జియో రాక ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యను లక్షల్లో పెంచింది. దీంతో హఫీజ్ వీడియోలకు మరిన్ని వ్యూస్ పెరుగుతూ వచ్చాయి. ఎస్‌ఈవో, ఆటోకాడ్, టాలీ, జావా, వెబ్‌డిజైనింగ్ కోర్సులకు మంచి స్పందన లభించింది.
ప్రధానంగా మొబైల్ సీక్రెట్స్ కు సంబంధించిన వీడియోలకు ఊహించని స్పందన వచ్చింది. ఒక్కో సీక్రెట్ సెట్టింగ్ వీడియోకు దాదాపు 12లక్షల వ్యూస్ వచ్చాయి. హఫీజ్ టెక్ పాఠాల గురించి తెలుసుకుని విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాల నుంచి సైతం చాలామంది ఆయన వద్ద టెక్ పాఠాలు నేర్చుకునేందుకు యైటింక్లైన్ వస్తుండటం విశేషం.

ప్రతీ నెలా లక్షల్లో సంపాదన:
యూట్యూబ్ లో హఫీజ్ 'తెలుగు టెక్ ట్యూట్' ఛానెల్ కు విపరీతమైన ఆదరణ రావడంతో ఆదాయం కూడా మొదలైంది. యూట్యూబ్ సంస్థ వారు హఫీజ్ కు రూ.1.50లక్షలను ప్రతీ నెల చెల్లిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో హఫీజ్ వీడియోలను కొంతమంది కాపీ చేసి తమ యూట్యూబ్ ఛానెల్స్ లో అప్ లోడ్ చేస్తుండటంతో వ్యూస్ కొంతమేర తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం రూ.1లక్ష ఆదాయం వస్తున్నట్టు తెలిపాడు.

సిల్వర్ ప్లేబటన్ అవార్డు:
యూట్యూబ్‌లో హఫీజ్ వీడియోలకు ఉన్న ఆదరణ రీత్యా ఆ సంస్థ 'సిల్వర్ ప్లేబటన్' అవార్డును కూడా బహూకరించింది. ప్రశంసా పత్రంతో పాటు అవార్డును పోస్టు ద్వారా పంపించారు. మున్ముందు గోల్డ్ ప్లేబటన్ అవార్డు సాధించడమే తన లక్ష్యం అంటున్నాడు హఫీజ్. వీలైనన్ని ఎక్కువ కోర్సులను అప్ లోడ్ చేస్తానని, నిరుపేదలు యూట్యూబ్ ను ఆదాయంగా మార్చుకునేలా అవగాహన కల్పిస్తానని హఫీజ్ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications