తెలంగాణలో ఉప ఎన్నికలు - కీలక మలుపు..!?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై అనర్హత పిటీషన్లు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
హైకోర్టు ఆదేశాలతో
పార్టీ మారిన అంశంలో పిటీషన్ల పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

ఎమ్మెల్యేల్లో టెన్షన్
కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాల పైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు.
ఉప ఎన్నికల అంచనాలు
తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హై కోర్టుక తెలిపిందన్నారు. మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమన్నారు. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications