హైదరాబాద్‌లో హాష్ ఆయిల్ సీజ్: మహిళ సహా నలుగురు అరెస్ట్, ‘పుష్ఫ’ రేంజ్‌లో గంజాయి స్మగ్లింగ్
హైదరాబాద్ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేసి విక్రయిస్తున్న నిషేధిత హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద గుట్టుచప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.
సోదాలు నిర్వహించి మూడు లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు కోసం బాలానగర్ పోలీసులకు అప్పగించారు.

మరోవైపు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీఎస్ న్యాబ్) అధికారులు 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమకు అందింని సమాచారంతో రహీమ్ ఉన్నీసా అనే మహిళ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. చిన్న చిన్న బాటిల్స్‌లో నిల్వ చేసిన హాష్ ఆయిల్‌ను గుర్తించి సీజ్ చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పుష్ప సినిమాను తలపించేలా గంజాయి స్మగ్లింగ్
పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన దుండగులు పోలీసులు చేతికి చిక్కారు. ఆయిల్ ట్యాంకర్ వాహనంలో మూడు గదులను ఏర్పాటు చేసి, అందులో మధ్య భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి తరలిస్తున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే, చివరకు ఈ ముఠాను కొమురంభీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు.

రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా.. జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. దీంతో చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆ ఆయిల్ ట్యాంకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ట్యాంకర్‌లో ఉన్న 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడ్నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది. దీని వెనుక ఎంతమంది, ఎవరెవరు ఉన్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications