పార్టీ ఫిరాయింపులు: తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుదారులపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను పిటిషనర్ల తరఫు న్యాయవాది స్వయంగా ఇచ్చేందుకు వెసులుబాటు కూడా కల్పించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోసాలే, జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది.
ఈ పిటిషన్ విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసి, ఆరోజే తుది విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్, తీగల క్రిష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్యానాయక్, కాలే యాదయ్య, కోరం కనకయ్య, జి. విఠల్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌లు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే విచారణ జరపాలని ఆదేశించాలని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు చెందిన నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంపత్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరువేరుగా హైకోర్టును కోరారు.

వీటిని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి, స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో పిటిషన్‌పై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సింగిల్ జడ్జి ఆదేశాలపై పిటిషనర్లు డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకున్నారు. ఈ పిటిషిన్లపై గురువారం విచారణ జరిగింది.
ఈ విచారణలో ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ పిటిషన్లపై తాను స్పీకర్ తరుపున కానీ, మరొకరి తరుపున గానీ కోర్టుకు వాదనలు చెప్పలేదని, సింగిల్ జడ్జి సూచనల మేరకు అడ్వొకేట్ జనరల్ హోదాలో కోర్టుకు సహాయకారిగా ఉన్నానని రామకృష్ణారెడ్డి తెలిపారు.
దీంతో అడ్వొకేట్ జనరల్ చెబుతున్న అభ్యంతరాలపై మీరేమంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ను డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ముందు జరిగిన వాదనల్లో ఏజీ కోర్టుకు సహాయకారిగానే వ్యవహరించారని తెలిపారు.
అయితే, డివిజన్ బెంచ్ ముందున్న అప్పీల్ విషయంలో స్పీకర్ తరఫున నోటీసులు తీసుకోడానికి అడ్వొకేట్ జనరల్ ఒప్పుకొన్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ముందున్న రికార్డులను డివిజన్ బెంచ్ పరిశీలించింది. రికార్డుల్లో నోటీసులు మొదటి ముగ్గురు ప్రతివాదులకే ఉన్నాయని, నాలుగో ప్రతివాదిగా ఉన్న స్పీకర్‌కు నోటీసులు అందలేదని గుర్తించింది. దీంతో స్పీకర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications