విద్యార్థులతో రాజీ దిశగా హెచ్‌సీయూ వీసీ: అన్ని డిమాండ్లపై చర్చిద్దామని పిలుపు
హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం ఆందోళన బాట పట్టిన విద్యార్థులతో చర్చించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ అప్పారావు పొదిలి సిద్ధమయ్యారు. ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు జరుపుదామని శుక్రవారం విద్యార్థులకు పిలుపునిచ్చారు.
విద్యార్థులు, అధ్యాపకులు కలిసి సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. మరోవైపు సమస్యలు పరిష్కరించాలంటూ, రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసీ విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు.

విద్యార్థుల అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. అయితే, వీసీ క్యాంపస్‌కు వచ్చి చర్చలు జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరికొందరు విద్యార్థులు వీసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను వీసీ అప్పారావు రద్దు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం కూడా హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications