తెలంగాణలో శనివారం సెలవు: హైదరాబాద్‌కు హెచ్చరిక, భారీ వర్షాలపై కేసీఆర్ రివ్యూ
హైదరాబాద్: రాజధానితోపాటు రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే గురు, శుక్రవారం విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
వర్షాలు కొనసాగుతున్న క్రమంలో తాజాగా శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఇప్పటికే శుక్ర, శనివారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, మరికొన్ని చోట్ల నదులు చెరువులు పొంగిపొర్లుతుండటం, రోడ్లు తెగిపోవడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని శనివారం వరకు సెలవు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో బారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలు, చెట్ల కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదుకు జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ 040-211 11111, 90001 13667కు ఫోన్ చేయాలని సూచించారు.
ఇది ఇలావుండగా, వాయవ్య బంగాళాఖాతంతోపాటు ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. జలపాతాలు పొంగిపొర్లుతుండగా.. జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి.
సీఎం కేసీఆర్ రివ్యూ
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిలో వరదల పరిస్థితి, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ప్రాణహిత తదితర నదుల ద్వారా కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి సీఎం ఆరా తీశారు.
కాగా, పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితులు అదుపులోనే వున్నాయని, భద్రాచలం వద్ద వరదను అంచనా వేస్తూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వుంటూ సహాయక చర్యల కోసం సిద్ధంగా వున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి సీఎంకి వివరించారు. రేపటెల్లుండి కూడా భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు












Click it and Unblock the Notifications