తెలంగాణలో జూన్ 27న భారీ వర్షాలు: నేడు సాధారణ వర్షపాతం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారంనాడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
పశ్చిమ, వాయువ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు ఎక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో శనివారం ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆదివారం తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

జూన్ 4న నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకిన విషయం తెలిసిందే. దీతో వర్షాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వర్షాలు కానరాలేదు. గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడలేదు. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల కదలికలు లేకపోవడంతో ఆకాశం నిర్మలంగా ఉంటోంది. దీంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. శుక్రవారం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి.
అయితే, తాజాగా, వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా కూడా గత వారం రోజులుగా వర్షాలు లేవు. జులై రెండో వారం నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావం దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతోపాటు ఏపీలోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి.












Click it and Unblock the Notifications