హైదరాబాద్‌లో భారీ వర్షం, వడగండ్లు! తెలంగాణకు అలర్ట్
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల వడగండ్లు కూడా పడటం గమనార్హం.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బోరబండ, కూకట్‌పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, కొంపల్లి, గాజులరామారం, సూరారం, జీడిమెట్ల, తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్, కిస్మత్ పూర్, బండ్లగూడలో వడగండ్లతో వర్షం కురిసింది. మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, హిమాయత్ సాగర్, గండిపేట ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ, ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి, హైటెక్ సిటీ నుంచి లింగంపల్లి రూట్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రూడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. భారీ వర్షం కురియడంతో నగరవాసులకు వాతావరణ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Heavy rain at Hyderabad with big and full of ice goals 😍
— Mohammed Zakir (@Zakir78960263) May 1, 2025
Baraf Ki Barish #Hyderabad
@bbcweather @TelanganaCMO @balaji25_t pic.twitter.com/98760ZSLFi
తెలంగాణకు 4 రోజులపాటు వర్షాల అలర్ట్
తెలంగాణలో మే 4 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ శాఖ అంచనా వేసింది. అయితే, ఈ అంచనాలు మే 3 వరకు ఉత్తర తెలంగాణకు వర్తించవు. మే 4న ఉత్తర ప్రాంతం తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం పొందుతుంది.
మే 4 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 2న వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, హన్మకొండ, జనగాం, భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మే 3న సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హన్మకొండ, జనగాం, భువనగిరి, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications