హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, నాగోలు, చైతన్యపురి, గడ్డి అన్నారం, దిల్సుఖ్నగర్, మలక్పేట్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
భారీ వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వెంటనే స్పందించిన జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఛత్రినాకా, హనుమాన్ నగర్లో డ్రైనేజీ పొంగిపొర్లాయి. దీంతో అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లపైనే డ్రైనేజీ ప్రవహించడంతో దుర్వాసన వస్తుందని స్థానికప్రజలు వాపోయారు. రోడ్లపైనే డ్రైనేజీ ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు నరకం అనుభవిస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే తరహాలో డ్రైనేజీలు పొంగుతున్నాయని అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఈ వానకాలం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ తోపాటు కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications