దంచికొడుతున్న వర్షాలు - మరో రెండు రోజులు ఇలా..!!
మండుతున్న వేసవి ఎండల వేళ ఉపశమనం దొరికింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. తెల్ల వారుజాము నుంచే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో ఉష్ణోగత్రల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి.
పలు చోట్ల భారీ వర్షం : హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. తెల్ల వారుజాము సమయంలో ప్రారంభమైన వర్షం కొనసాగుతోంది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్సుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, అమీర్ పేటర్ ,యూసఫ్ గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, బోయిన్ పల్లి ,పాతబస్తీ , రాజేంద్ర నగర్, శేర్ లింగంపల్లి, గచ్చిబౌలి, ఏరియాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. నగరంలో కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

మరో రెండు రోజులు : రాష్ట్రంలో వర్షాలతో పాటు కొన్నిచోట్ల ఎండలు కూడా దంచికొట్టాయి. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవ్వొచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లో దంచి కొట్టుడు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో 2.9, నల్గొండ జిల్లా చింతపల్లిలో 2.2, మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్లో 1.9, నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంలో 1.7, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొండాపూర్‌లో 1.2 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications