భారీ వర్షం: నిండిన హుస్సేన్ సాగర్, ట్రాఫిక్ జాంతో ఇబ్బంది
కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్/అమరావతి: కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలు ప్రాంతాల్లో రహదారులపైకి వర్షపు నీరు చేరింది. సికింద్రాబాద్, ఉప్పల్, పంజాగుట్ట, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సైనిక్‌పురి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.
హుస్సేన్ సాగర్ కు దారితీసే నాలాలన్నీ పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా తొలగించేందుకు జిహెచ్ఎంసి అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి.

హుస్సేన్ సాగర్‌లోకి భారీగా వరద నీరు
హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నిన్నటి వరకూ నీరు లేక బోసిపోయిన సాగర్ ఇప్పుడు నిండుకుండలా కనిపిస్తోంది.
నీట మునిగిన కాలనీలు
భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం కావడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల ఈ వర్షానికి రోడ్లు చెడిపోయింది. సికింద్రాబాద్, మయూర్ మార్గ్ తదితర ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు వస్తోంది. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై నీరు నిలిచింది.
అంబర్ పేట్, తాజ్ ఐలాండ్, పుత్లీబౌలి, సిబిఎస్, అమీర్ పేట, తార్నాక, గోల్నాక, నింబోలి అడ్డా, నిమ్స్, బల్కంపేట, మలక్ పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారింది. కాగా, పదకొండు గంటల వరకు ఎవరూ రోడ్ల పైకి రావొద్దని జిహెచ్ఎంసి అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications