తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు: ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు రోజులుగా కాస్త విరామం ఇచ్చిన వర్షాలు.. మరోసారి దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు-మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టు 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆగస్టు 30 నుంచి అతి నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ జిల్లాల్లోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది.

ఆగస్టు 31 నుంచి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 1వ తేదీన భారీ నుంచి ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరోవైపు, బుధవారంనాడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, షాపూర్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత వాతావరణం చల్లగా మారిపోయి.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications