బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఆంక్షలేవీ? సర్కారుకు హైకోర్టు ప్రశ్నలు, తెలంగాణ సీఎస్‌కు కరోనా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు టీఆర్ఎస్ సర్కారును ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు అతితక్కువగా చేస్తున్నారని, పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని పేర్కొంది.

కరోనా పరీక్షలు పెంచండి..
తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై నివేదిక సమర్పించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ఏజీ వివరించారు. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగాపెంచడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు తక్షణమే పెంచాలని స్పష్టం చేసింది.

బార్లు, పబ్బులు, థియేటర్లపై ఆంక్షలేవీ?
రాష్ట్రంలో బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు టీఆర్ఎస్ సర్కారును ఆదేశించింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కరోనా పాజిటివ్, మరణాలు రేటు వెల్లడించాలని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ఆదేశించింది.
కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని, నిబంధనలు పాటించనివారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై ప్రచారం చేయాలని, అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది.

10వ తరగతి పరీక్షలపై సర్కారు కీలక నిర్ణయం
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు చదివే పాఠశాలలకు పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండకుండా చర్యలు తీసుకుంటోంది. విద్యార్థి చదివే పాఠశాలకు కనీసం 5 కి.మీ పరిధిలోనే పరీక్ష కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయనున్నారు.
గతంలో విద్యార్థి చదివిన పాఠశాలకు గరిష్టంగా 8 కి.మీ పరిధిలో ఉండేవి. కానీ, కరోనా ప్రభావం కారణంగా పరీక్ష కేంద్రాలను 5 కి.మీ పరిధిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమీపంలోనే ఉన్న పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు సదుపాయాలు ఉన్న స్కూళ్లు లేదా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలను కూడా సెంటర్లుగా ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఒక్కో గదిలో 10-12 మంది విద్యార్థులే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

సీఎస్ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తనకు కరోనా సోకినట్లు సీఎస్ స్వయంగా వెల్లడించారు. నిత్యం వివిధ శాఖలతో సమీక్షలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన కాస్త అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో రోజువారీ కార్యకలాపాలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.
తనను ఇటీవల కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, నిజామాబాద్ నగరంలోని నిష్కల్ న్యూరో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో 30 మందికి పరీక్షలు చేయగా, 10కి కరోనా సోకినట్లు తేలింది.












Click it and Unblock the Notifications