బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి, కండీషన్స్ అప్లై..!!
బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. బీఆర్‌ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి సంఘాలు ఈ సదస్సు నిర్వహణకు నిర్ణయించారు. తొలుత పోలీసులు ఈ సదస్సుకు అనుమతి నిరాకరించారు. దీంతో.. నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. రేపు (శనివారం) సరూర్ నగర్ స్టేడియంలో జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఎట్టకేలకు బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు అనుమతి దక్కింది. నిర్వాహకులు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, కొన్ని షరతులు విధిస్తూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని..హైవే పైన రాకపోకలకు ఇబ్బంది కలిగించవద్దని స్పష్టం చేసింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 'యూత్ డిక్లరేషన్' హామీలను, ఉద్యోగాల కల్పనలో వారి వైఫల్యాలను నిలదీయడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సభ నిర్వహణ కోసం బీఆర్‌ఎస్ నేతలు జూన్ 30నే పోలీసులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. శాంతిభద్రతలు కారణంగా చూపుతూ పోలీసులు చివరి నిమిషంలో అనుమతిని నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సభను అడ్డుకుంటోందని ఆరోపించిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది.

యువతకు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల పై చర్చ
కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌లోని హామీల అమలుపై ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు వివరించాలని పార్టీ భావిస్తోంది. ప్రత్యేకంగా, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ సదస్సు నిర్వహిస్తున్న ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంకా గాంధీ సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే వేదికపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే కార్యాచరణను ప్రకటించాలని బీఆర్‌ఎస్ వ్యూహం సిద్దం చేసింది. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కాగా.. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వం చెబుతున్న జాబ్ క్యాలెండర్లు.. ఉద్యోగాల నియామకాల పైన లెక్కలు వెల్లడించాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది.












Click it and Unblock the Notifications