హైటెక్ మోసం: ఎటీఎం కార్డు బ్లాక్ అవుతుందని చెప్పి ఆకౌంట్ నుంచి 94 వేలు డ్రా
హైదరాబాద్: ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని ఖాతాదారుని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 94,990 నగదుని అపహరించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలంలో చోటు చేసుకుంది. టైరు పంక్చర్ షాపుని నిర్వహిస్తున్న సయ్యద్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 3వ తేదీన 9135310570 నెంబర్ నుంచి అతడికి ఫోన్‌కాల్ వచ్చింది.
సదరు కాల్ చేసిన వ్యక్తి తాము ఎస్‌బీహెచ్ ముంబై శాఖ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ ఎటీఎం కార్డు బ్లాక్ అవుతుందని నమ్మబలికాడు. కార్డు బ్లాక్ చేయకుండా ఉండాలంటే ఏటీఎంపై ఉన్న 16 అంకెల సంఖ్యను చెప్పాలని అడిగాడు. దీంతో పాటు ఖతాదారుని ఆధార్ నంబర్, పూర్తి చిరునామా చెప్పాడు.
ఆ తర్వాత ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుందని, అందులో ఉండే అంకెలను చెప్పాలని సూచించాడు. దీంతో ఆగంతకుని మాటలు నమ్మిన సయ్యద్ తన ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ నెంబర్‌ను చెప్పాడు. మరుసటి రోజు కూడా ఇలానే ఫోన్ చేశాడు. ఇలా సయ్యద్ మహబూబ్ బ్యాంక్ అకౌంట్ సమాచారం పూర్తిగా తెలుసుకుని డబ్బులు డ్రా చేశాడు.

మూడో రోజు కూడా ఫోన్ రావడంతో అనుమానించిన సయ్యద్ మహబూబ్ బ్యాంకుకు వెళ్లి వాకబు చేయగా, తన అకౌంట్ నుంచి రూ. 50 వేలు ఒకసారి, రూ. 44, 990 మరోసారి డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో బ్యాంకు అధికారులను కలిసి తన కార్డుని బ్లాక్ చేయించడంతో పాటు విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలకు సంబంధించిన వివరాలను ఎవరు అడిగినా చెప్పవద్దని సూచించారు. ఖాతాకు సంబంధించి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకులో సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications