హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 12వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు.
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 12వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి.
పార్లమెంట్ ప్రవాస్ యోజనలో అమిత్ షా పాల్గొంటారని.. ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో పాల్గొంటారనే విషయంపై త్వరలోనే వెల్లడిస్తామని పార్టీ నేతలు తెలిపారు. గతంలోనూ ఆదిలాబాద్ పార్లమెట్ నియోజకవర్గంలో ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు అమిత్ షా పర్యటన ఖరారైనప్పటికీ.. చివరి క్షణంలో ఆయన పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈసారి ఆదిలాబాద్ లేదా మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్‌లో సుమారు రెండు గంటలపాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారంపై అమిత్ షా ఆరా తీశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. ప్రతి నెల ఓ కేంద్ర మంత్రి లేదా జాతీయ నాయకులను ఒక నియోజకవర్గానికి రప్పించి స్థానిక నాయకులతో చర్చలు జరుపుతున్నారు. వివిధ కుల సంఘాల నేతలతో పార్టీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ గురువారం ప్రకటించారు. దీంతో బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళనున్నట్లు స్పష్టమైంది.












Click it and Unblock the Notifications