శాడిస్ట్ భర్త: భార్య జననావయవాలపై కత్తి గాట్లు, ఎప్పుడూ అనుమానమే!
రవి అనే ఓ భర్త.. భార్య ప్రియాంకకు ప్రత్యక్ష నరకం చూపించాడు.అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో.. ఆమె జననావయవాలపై కత్తితో గాట్లు పెట్టాడు.
Recommended Video

ఘట్‌కేసర్: భార్యపై తీవ్ర అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను నిత్యం వేధింపులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నాడు. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. భర్త వేధింపులు తాళలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన పి.ప్రియాంక(25)కు, వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం రాంధన్ తండాకు చెందిన రవితో 2005లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రవికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ రావడంతో ఘట్ కేసర్ మండలం పోచారం పంచాయితీ పరిధిలోని అన్నోజిగూడాలో కాపురం పెట్టాడు.

ఇదే క్రమంలో కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న రవి.. ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. జననావయవాలపై కత్తితో గాట్లు పెట్టి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. అతని వేధింపులు భరించలేక ప్రియాంక పుట్టింటికి వెళ్లిపోగా.. అక్కడికి వెళ్లి మరీ ఆమెపై దాడి చేశాడు. దీనిపై అక్కడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ప్రియాంక శరీరంపై కత్తితో గాట్లు పెట్టి హింసించాడు. అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో వైద్య పరీక్షలు కూడా చేయించాడు. భర్త చర్యలతో విసిగిపోయిన ప్రియాంక ఈ నెల 24న పిల్లలను వెంటపెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లింది.
ఈ నేపథ్యంలో తమ కుమార్తె ఆచూకీ దొరకడం లేదంటూ ప్రియాంక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె జనగాంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెను ఘట్ కేసర్ రప్పించగా.. భర్త ఆకృత్యాలను ఆమె పోలీసులకు వివరించింది. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రియాంక ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు కేసు నమోదు చేశామని ఘట్ కేసర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్ తెలిపారు.












Click it and Unblock the Notifications