బీఆర్ఎస్‌కు డబుల్ డిజిట్ ఖాయం: హంగ్ వస్తోందంటూ కేసీఆర్
ఖమ్మం: కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకు ఓట్లు, సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు మద్ధతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో బీజేపీకి 200 సాట్లు కూడా రావని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి 12 సీట్లు వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్, సాగు, తాగునీరు సరఫరాపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, తాగునీటి సమస్యలపై తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి ఎద్దడి ఉన్న మాట వాస్తవమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే తనను దూషిస్తున్నారని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.
ఎక్కడికి పోయింది కరెంటు? తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందిన కరెంటు ఎక్కడికి పోయింది? కరెంటు కోతలు ఉన్నాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరికోతలుంటే.. కాంగ్రెస్ సర్కారులో కరెంటు కోతలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చుతున్నారని మండిపడ్డారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు.
ఇప్పుడు హామీలు నెరవేర్చమంటే బూతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహబూబ్నగర్లో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశా.. దానికి తానేదో అబద్ధాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ బదులిస్తోంది కానీ సమస్యను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు కేసీఆర్. మూడు నెలల్లోనే కరెంట్ మాయం అయ్యిందా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్.. రూ.2500 ఇస్తామన్న హామీ ఏమయ్యిందన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు తులం బంగారం అడిగితే కస్సుమంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను సాధించిన తనని జైళ్లో వేస్తారా? జైళ్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడతారా? అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications