ప్రమాదమా? చంపేశారా?: బుల్లెట్ రాణి అనుమానాస్పద మృతి

Subscribe to Oneindia Telugu
  TOP 10 NEWS Today టుడే టాప్ 10 న్యూస్ | Oneindia Telugu

  హైదరాబాద్‌: నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌(32) మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భర్త అబ్దుల్‌ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదం అనుమానాస్పాదంగా ఉంది. సనాను ఆమె భర్తే హత్య చేశాడంటూ ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

   తెల్లవారుజామునే ప్రమాదం..

  తెల్లవారుజామునే ప్రమాదం..

  ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. టోలీచౌకి అల్‌హస్నత్‌ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన సనాఇక్బాల్‌ సోమవారం రాత్రి బండ్లగూడ సన్‌సిటీలో బంధువుల ఇంటికి భర్తతో కలిసి ఫియట్‌ కారు(టీయస్‌13ఈసీ2142)లో వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా..హైదర్‌షాకోట్‌ రేడియల్‌ రోడ్డు పైకి వచ్చిన కొన్నినిమిషాలకే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగకుండా డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లి విద్యుత్తు స్తంభాన్ని బలంగా తగిలి అవతలి వైపున రోడ్డు దాటి ఫుట్‌పాత్‌పై ఆగింది.

  తీవ్రగాయాలపాలైన సనా మృతి..

  తీవ్రగాయాలపాలైన సనా మృతి..

  ఈ ప్రమాదంలో కారులో ముందు కూర్చున్న సనాఇక్బాల్‌కు ఆమె వైపుఉన్న విద్యుత్‌ స్తంభం బలంగా తగలింది. ఆమె పక్కటెముకలు విరిగిపోవడంతోపాటు తలకు బలమైన గాయాలయ్యాయి. కారు నడుపుతున్న ఆమె భర్త నదీమ్‌కు కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది వారిని నానల్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, కొద్దిసేపటికే సనాఇక్బాల్‌ మృతిచెందారు. ఆమె భర్త నదీమ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నదీమ్‌ను బుధవారం డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. కాగా, సనాఇక్బాల్‌ సోదరి సీమాఇక్బాల్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

   చిన్ననాటి నుంచి బైక్ అంటే ప్రాణం..

  చిన్ననాటి నుంచి బైక్ అంటే ప్రాణం..

  చిన్నప్పటి నుంచే బైక్‌రైడింగ్‌ను అలవర్చుకున్న సనాఇక్బాల్‌ దేశవ్యాప్తంగా పలుప్రాంతాలకు ఒంటరిగా బైక్‌పై ప్రయాణించి ప్రముఖ మహిళా రైడర్‌(బుల్లెట్ రాణి)గా పేరు తెచ్చుకున్నారు. ఏడో తరగతి నుంచి బైక్‌రైడింగ్‌లో పాల్గొనడం ఆరంభించిన సనా.. తొలుత గుజరాత్‌కు బైక్‌రైడింగ్‌ చేసి గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఆమె సుమారు 38వేల కి.మీ.లు బైక్‌పై ఒంటరిగా ప్రయాణించడం విశేషం. బైక్‌రైడింగ్‌తోపాటు ఆత్మహత్యల నివారణ కోసం విశేష కృషి చేసి గుర్తింపుపొందారు. మానసిక ఒత్తిళ్లకు గురయ్యే యువతులను, బాలికలను చైతన్యపరిచే కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు.

   మరణంపై అనుమానాలు..

  మరణంపై అనుమానాలు..

  ‘నా కుమార్తె సనా మరణాన్ని రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించారు. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో టోలిచౌకిలోని మా ఇంటికి వచ్చి సనాను బలవంతంగా నదీమ్‌ తీసుకెళ్లాడు. ఆ తర్వాత గంటకే సన్‌సిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి సనా చనిపోయినట్టుగా తెలిసింది. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన కారు ముందు భాగం అంతా బాగానే ఉంది. సనా కూర్చున్న ఎడమవైపు వాహనం పూర్తిగా దెబ్బతింది. నదీమ్‌కు మాత్రం ఎటువంటి దెబ్బలు తగల్లేదు. ఇదంతా చూస్తే ఇది ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌గా కనబడుతోంది. మూడేళ్ల క్రితం వివాహమైన సనాను ఇష్టమొచ్చినట్టు కొడుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో ఏడాది నుంచి దూరంగా ఉంటోంది. అయినా నదీమ్‌ ఇంటికి తరచూ వస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు ' అని సనా తల్లి ప్రొ. షహీన్‌ఖాన్‌ ఆరోపించారు.

  ప్రమాదం అనుమానాస్పదంగానే..

  ప్రమాదం అనుమానాస్పదంగానే..

  సాధారణంగా ఏ వాహనమైనా రోడ్డుకు ఎడమ వైపు ప్రయాణిస్తుంది. అలాంట ప్పుడు రెండు రోడ్ల మధ్య ఉండే డివైడర్‌ వాహనానికి కుడి వైపు ఉంటుంది. కారు డివైడర్‌ను ఢీ కొంటే కుడి వైపు దెబ్బతినాల్సి ఉంది. అయితే సనా, నదీమ్‌ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొన్నప్పుడు ఎడమ వైపు పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్‌ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఎడమ వైపు బలంగా ఢీ కొట్టినట్లు ప్రమాద స్థలిని బట్టి తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తల, ఛాతీ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలే ఆమె ప్రాణాలు తీశాయని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఎడమ పక్క పూర్తిగా ధ్వంసమైనా.. కుడి వైపు(డ్రైవింగ్‌ సీటు) కొద్ది మేర ధ్వంసమైంది. కారు ముందు భాగంలో ఎలాంటి డ్యామేజ్‌ లేకపోవడం అనుమానా లకు తావిస్తోంది. ప్రమాద స్థలి వద్ద వాహనానికి సడన్‌ బ్రేక్‌ వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు మంగళవారం సాయంత్రం సీసీ ఫుటేజీల సేకరించారు. నదీమ్‌ను కూడా ఈ ప్రమాదం గురించి ప్రశ్నించనున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Noted cross-country motorcycle rider, Sana Iqbal, from Hyderabad, who had completed a countrywide solo expedition to create awareness about suicide, was killed in a car crash in Sun City in the early hours of Tuesday.Her husband Abdul Nadeem, who was driving, has been badly injured and is in hospital.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి