హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నగర శివారులోని శంషాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనునన హైస్పీడ్ రైలు(బుల్లెట్ ట్రైన్) నెట్ వర్క్‌ను, మెట్రో రైలుతో అనుసంధానించేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని .. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.
మూడు కారిడార్ల ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె కారిడార్లు ఉన్నాయి. గంటకు సుమారు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ అత్యాధునిక బుల్లెట్ ట్రైన్ల కోసం శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని బహదూర్‌గూడ, రషీద్‌గూడ ప్రాంతాల్లో ఒక భారీ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 500 ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసింది.

మెగా జంక్షన్‌గా శంషాబాద్
ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం 'మల్టీ-మోడల్ కనెక్టివిటీ'. మెట్రో రైలు రెండో దశలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు అక్కడి నుంచి 'ఫ్యూచర్ సిటీ' వరకు కొత్త లైన్లను ప్రభుత్వం వేగంగా నిర్మిస్తోంది. ఈ మెట్రో మార్గాలను ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ టెర్మినల్‌తో నేరుగా అనుసంధానించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు (ORR), మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్.. ఈ నాలుగు ప్రధాన రవాణా వ్యవస్థలు ఒకేచోట కలిసేలా ఒక 'మెగా జంక్షన్'ను రూపొందించనున్నారు.
ప్రయాణికులకు దక్కనున్న ప్రయోజనాలు
ఈ భారీ ప్రణాళిక కార్యరూపం దాల్చితే ప్రయాణికులకు ప్రపంచస్థాయి రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నగరంలోని ఏ మూల నుంచి అయినా మెట్రోలో బయలుదేరి నేరుగా బుల్లెట్ ట్రైన్ టెర్మినల్‌కు చేరుకోవడం, అక్కడి నుంచి ఇతర మెట్రో నగరాలకు వేగవంతంగా ప్రయాణించడం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో లాజిస్టిక్, కనెక్టివిటీ హబ్‌గా నిలుపుతుంది. త్వరలోనే ఈ మెగా ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక వెలువడనుంది.












Click it and Unblock the Notifications